: మన మువ్వన్నెల జెండాకు 93 ఏళ్ళు
విభిన్న మతాలు, కులాలు, విలక్షణ సంస్కృతులు, వేర్వేరు భాషలు.. ఇంతటి అతి భారీ వైవిధ్యం కూడా 'భారతీయత' అనే సమున్నత భావనతో ఏకరూపతను సంతరించుకుంది. అంతటి మహనీయత సాధ్యం కావడానికి స్వాతంత్ర్య పోరాటం సందర్భంగా వెల్లివిరిసిన స్పూర్తే కాదు, మువ్వన్నెల జెండాది కూడా కీలక పాత్రే. తెల్లదొరతనానికి వ్యతిరేకంగా పెల్లుబికిన విమోచన కాంక్షకు ఓ రూపమిచ్చిన ఘనత త్రివర్ణ పతాకానిదే.
అలాంటి ఘన చరిత్ర కలిగిన ఈ భారత పతాకం రూపొంది నేటికి 93 ఏళ్ళు అయింది. 1921, ఏప్రిల్ 1న మన తెలుగు వాడే అయిన పింగళి వెంకయ్య ఈ జాతీయ జెండాను రూపొందించారు. ఈ సందర్భంగా, ఈరోజు విజయవాడలో త్రివర్ణ పతాక ఆవిర్బావ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ర్యాలీలో కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, ఎంపీ లగడపాటి రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. కాగా, పింగళి వెంకయ్యకు 'భారత రత్న' ఇచ్చే విషయమై కేంద్రంతో చర్చిస్తానని కోట్ల హామీ ఇచ్చారు.