: ఈ నెల 24న ఢిల్లీకి గవర్నర్ నరసింహన్
గవర్నర్ నరసింహన్ ఈ నెల 24న ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రపతి పాలనకు పార్లమెంటు ఆమోదం, రాష్ట్ర శాసనసభ రద్దు తదితర అంశాలపై కేంద్ర హోంశాఖతో చర్చించేందుకు ఆయన ఢిల్లీ వెళ్తున్నట్టు సమాచారం. ఈ నెల 30 వ తేదీకి రాష్ట్రపతి పాలన విధించి రెండు నెలలు పూర్తి కావస్తున్నందున, ఈ లోపే పార్లమెంటు ఆమోదం పొందవలసి ఉంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో లోక్ సభను సమావేశ పరచే అవకాశం లేనందున రాజ్యసభ ఆమోదమైనా తీసుకోవాలని గవర్నర్ ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశారు. ఇటీవలే జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగినా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్ర శాసనసభను రద్దు చేసి రాష్ట్రపతి పాలనను కొనసాగించాలని కేంద్రం భావిస్తుండడంతో దీనిపై చర్చించేందుకు గవర్నర్ కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినట్టు తెలుస్తోంది.