: ఓటర్లని ప్రలోభపెడితే ఏడాది జైలు
రాష్ట్రంలో ఓటర్లు మొత్తం 6.48 కోట్లు, అందులో పురుషులు 3.26 కోట్లు, మహిళలు 3.22 కోట్లు కాగా, 18-19 ఏళ్ల వయస్సున్న యువ ఓటర్లు 33 లక్షలు. దేశంలో అత్యధిక ఎన్నికల వ్యయం జరిగే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ది ప్రథమ స్థానం. 101 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధిక వ్యయానికి అవకాశం ఉందని ఎన్నికల సంఘం గుర్తించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు లెక్కాపత్రం లేని రూ. 105 కోట్ల నగదు పట్టుకున్నామని ఎన్నికల అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా పట్టుకున్న దానిలో ఇది 46 శాతమని ఈసీ తెలిపింది.
మద్యం అక్రమ తరలింపునకు సంబంధించి దేశవ్యాప్తంగా ఇక్కడే అత్యధికంగా 29,990 కేసులు నమోదయ్యాయి. 3.92 లక్షల లీటర్ల మద్యాన్ని సీజ్ చేసినట్లు ఈసీ తెలిపింది. ఓటర్లను ప్రలోభ పెట్టేవారిపై ఫిర్యాదు చేసేందుకు సెంట్రల్ హెల్ప్ లైన్ 1950ను ఏర్పాటు చేశారు. ఓటర్లను ప్రలోభపెడితే ఐపీసీ 171బి - సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తామని, దీనికి ఏడాది పాటు జైలు శిక్ష పడుతుందని ఎన్నికల సంఘం అధికారులు చెప్పారు.