: రాష్ట్రంలో 25 వేల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు: సీఈసీ
ఆంధ్రప్రదేశ్ లో 25,300 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని సీఈసీ సంపత్ తెలిపారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు 6.48 కోట్ల మంది ఓటర్లుగా నమోదయ్యారని తెలిపిన ఆయన, దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలో 105 కోట్ల రూపాయలు స్వాధీనం అయ్యాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,142 అక్రమ నగదు తరలింపు కేసులు నమోదయ్యాయని, 29,290 మద్యం తరలింపు కేసులు నమోదయ్యాయని సీఈసీ సంపత్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో అన్నీ కొత్త ఈవీఎంలే వాడుతున్నామని ఆయన తెలిపారు. ఈవీఎంలలో తలెత్తే సాంకేతిక లోపాలను అధిగమిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల ఒకే పార్టీకి ఓట్లు పడినట్టు ఫిర్యాదులు వచ్చాయని, ఆయా చోట్ల రీపోలింగ్ కు ఆదేశించామని ఆయన వివరించారు. నోటాకు గుర్తింపు చిహ్నం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.