: 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' పుస్తకం ఆధారంగా విమర్శలు గుప్పించిన మోడీ
ప్రధాని మన్మోహన్ సింగ్ మాజీ మీడియా సలహాదారు సంజయ్ బారు రాసిన 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' పుస్తకం ఆధారంగా బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసోంలోని కోకిజాన్ లో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ, యూపీఏ ప్రభుత్వంలో తల్లీకొడుకులు తెరవెనుక మంత్రాంగం నడిపించారని మండిపడ్డారు. కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రధానిని కీలుబొమ్మను చేసి ఆడించారని విమర్శించారు.
ఓట్ల కోసం సోనియా, రాహుల్ తెర ముందుకు వచ్చి ప్రచారం చేసి, తెరవెనుక నుంచి ప్రభుత్వాన్ని నడిపించారని దుయ్యబట్టారు. ఎన్నికలప్పుడే కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ నేతలకు ప్రజలు గుర్తుకు వస్తారని అన్నారు. ఇప్పడు ప్రజలు కాంగ్రెస్ ను మర్చిపోతారని ఆయన తెలిపారు. మన్మోహన్ సింగ్ పదేళ్లలో 1200 సార్లు మాట్లాడారని చెప్పడం ఆయన మౌన మోహన సింగ్ కాదని చెప్పడమేనన్న మోడీ, పేదల కోసం మన్మోహన్ సింగ్ ఏం చేశారో విడుదల చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.