: పడక సుఖంలో చింపాంజీలు తక్కువ కాదట
మంచి మంచం. దానిపై సుతిమెత్తని కుషన్ తో హాయిగా నిద్రపట్టే పరుపు, మంచి దిండు, మెత్తడి దుప్పటి వెరసి 'ఎంత హాయి ఈ రేయి!' అన్నట్లుగా పడకగదిలో విశ్రాంతిని కోరుకోని వారుండరు. అయితే, మానవులకు దగ్గరి పోలికలతో ఉండే చింపాంజీలు కూడా పడక సుఖంలో మనకేమాత్రం తీసిపోవట. చింపాంజీల జీవితంపై పరిశోధన చేసిన యూనివర్సిటీ ఆఫ్ నెవెడా, ఇండియానా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఆశ్చర్యపరిచే కొన్ని వివరాలు వెల్లడించారు. చింపాంజీలు ఉగాండన్ ఐరన్ అనే చెట్టు కలపను తమ పడక కోసం ఎక్కువగా వాడతాయట. ఈ కలప బలంగా, మెత్తగా, సౌకర్యంగా ఉండడమే అందుకు కారణం. సాధారణంగా చింపాంజీలు చెట్ల కొమ్మలపై పడకేస్తాయని తెలిసిందే. ఇవి ఎక్కువగా బజ్జోడానికి ఉపయోగించే ఏడు రకాల చెట్లపై శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. వాటి దృఢత్వం, వంగే గుణం, బలం మొదలైన అంశాలను పరిశీలించారు. చింపాంజీలు 73 శాతం ఉగాండన్ ఐరన్ వుడ్ నే తమ పడక కోసం ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు.