: సమైక్యం కోసం పోరాడిన వారినే ఎన్నుకోవాలి: కిరణ్
రాష్ట్ర విభజన వద్దంటూ సోనియా, రాహుల్ కు ఎంతగానో చెప్పానని... విభజనతో తెలుగుజాతికి తీవ్ర నష్టం జరుగుతుందని కాంగ్రెస్ పెద్దలకు చెప్పానని జేఎస్పీ అధినేత కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. అయినా తన మాట వినకుండా కేవలం 23 నిమిషాల్లో రాష్ట్రాన్ని ముక్కలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విభజనలో భాగస్వామిని కాలేనంటూ పార్టీకి, పదవికి రాజీనామా చేశానని... రాష్ట్రాన్ని ముక్కలు చేసిన నేతలు మనకు కావాలా? లేక సమైక్యం కోసం తీవ్రంగా కృషి చేసిన నేతలు కావాలా? అంటూ ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ప్రయత్నించిన నేతలనే ఎన్నుకోవాలని కోరారు. టీడీపీ, వైఎస్సార్సీపీ, బీజేపీలను ఎన్నికల్లో ఓడించాలని కోరారు. అన్ని పార్టీలు సీట్లను అమ్ముకున్నాయని... జేఎస్పీ మాత్రం ఒక్క సీటును కూడా అమ్మలేదని చెప్పారు. ఈ రోజు పీలేరులో రోడ్ షో సందర్భంగా, ఆయన ప్రసంగించారు.