: నౌక కెప్టెన్ అరెస్ట్... మిన్నంటుతున్న ఆగ్రహం
దక్షిణ కొరియా తీర సముద్రంలో భారీ నౌక ప్రమాదానికి సంబంధించి బాధ్యుడైన కెప్టెన్ లీజూన్ సియోక్(69), మరో ఇద్దరు నౌకా సిబ్బందిని పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేశారు. ఐదు క్రిమినల్ కేసులను కెప్టెన్ ఎదుర్కోనున్నారు. మరోవైపు గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న సహాయక కార్యక్రమాలు ఫలితాలను ఇవ్వడం లేదు. ప్రమాదం జరిగి నాలుగు రోజులు గడిచినా గల్లంతైన 273 మంది విషయంలో ఎలాంటి పురోగతి లేదు. వీరంతా ఓడలోనే విగతజీవులై ఉండి ఉండవచ్చని భావిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది స్కూల్ విద్యార్థులే. దీంతో తమ వారి కోసం తల్లిదండ్రులు, బంధువులు నిరీక్షించి, నిరీక్షించి అసహనానికి గురవుతున్నారు. ఓడను బయటకు తీయాలని, తమ వారిని చివరిసారైనా చూసుకుంటామని వారు కోరుతున్నారు. కానీ, నిపుణులు మాత్రం ఓడను బయటకు తీయడం సాధ్యం కాదని, క్రేన్ల సాయంతో కొన్ని మీటర్లు పైకి ఎత్తడం మాత్రమే వీలవుతుందని అంటున్నారు.