: కేరళలోని అనంత పద్మనాభుడి లక్ష కోట్లను దోచేశారా?
మూడేళ్ల క్రితం... 2011 జూలైలో ఒక వార్త దేశీయంగానూ, ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంచలనం. కేరళలోని తిరువనంతపురంలో అప్పటి వరకూ పెద్దగా తెలియని అనంతపద్మనాభ స్వామి ఆలయంలో లక్ష కోట్ల రూపాయల విలువైన బంగారం, ఆభరణాలు ఉన్నాయంటూ ఒక వార్త వెలుగులోకి వచ్చింది. సుప్రీంకోర్టు నియమించిన కమిటీ కూడా సంపదను లెక్కించి అది నిజమేనని తేల్చింది. దీంతో అనంత పద్మనాభుడి దేవాలయ గొప్పతనం విశ్వవ్యాప్తమైంది. అయితే, ఇప్పుడు మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఆ అనంత పద్మనాభుడి అనంత బంగారాన్ని దోచేసి అసలు ఆభరణాల స్థానంలో నకిలీవి పెట్టి ఉంటారని అమికస్ క్యూరీ గోపాల్ సుబ్రహ్మణ్యం ఒక సంచలన నివేదికను సుప్రీంకోర్టుకు తాజాగా సమర్పించారు. ఆలయ నిర్వహణ, సంపదపై ఈ నివేదికలో వివరాలు పేర్కొన్నట్లు తెలుస్తోంది.
35 రోజుల పాటు తనిఖీలు నిర్వహించిన అనంతరం సుబ్రహ్మణ్యం ఈ నివేదికను కోర్టుకు అందజేశారు. ఆలయంలో ఉన్న బంగారం, ఆభరణాలను దొంగతనం చేసి, వాటి స్థానంలో నకిలీవి పెట్టి ఉంటారని ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఆలయ సంపద నిర్వహణలో అవకతవకల వెనుక పెద్ద కుట్ర దాగి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. దాన్ని బయటకు తీయడానికి వీలుగా మాజీ కాగ్ వినోద్ రాయ్ తో ఆడిట్ జరిపించాలని సూచించారు.
ఆలయంలో బంగారంతో ఉన్న గదులు బయటపడడం మనకు తెలిసిందే. ఏ నుంచి ఎఫ్ వరకు గదులను తెరచి వాటిలోని బంగారం ఆభరణాల విలువని లెక్కించారు. ఒక్క బీ అనే గదిని మాత్రం తెరవలేదు. దానిపై నాగ పడగ ఉందని, అది తెరిస్తే వినాశనమేనన్న హెచ్చరికల నేపథ్యంలో అది ఆగిపోయింది. అయితే, దానిని తెరిచి అందులోని సంపద కూడా లెక్కించాలని సుబ్రహ్మణ్యం కోరారు. ఆసక్తికరంగా ఆలయంలో జీ, హెచ్ అనే రెండు గదులను కొత్తగా ఆయన గుర్తించారు. వీటిని కూడా తెరచి సంపద లెక్కించాలని కోరినట్లు సమాచారం. మరోవైపు గత 30 ఏళ్లుగా భక్తులు సమర్పించిన వాటి వివరాలు లేవని, అందుకే పూర్తిస్థాయి ఆడిట్ అవసరమని కోర్టుకు సూచించారు.