: పోలీసుల అదుపులో అరబ్ షేక్... ఐదుగురు మహిళలు
పెళ్లిళ్ల పేరుతో పేద ముస్లిం బాలికలను చెరబట్టే మరో అరబ్ షేక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ భవానీ నగర్ లోని ఓ లాడ్జిపై దాడి చేసి ఒమన్ దేశానికి చెందిన షేక్ రషీద్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో షేక్ తో పాటు మరో ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు. ఈ దాడుల్లో మరో 13 మంది పెళ్లిళ్ల బ్రోకర్లు కూడా పట్టుబడ్డారు. వీరిలో పాతబస్తీకి చెందిన ఐదుమంది మహిళా బ్రోకర్లు కూడా ఉన్నారు. షేక్ చెర నుంచి తప్పించుకుని వచ్చిన 14 ఏళ్ల బాలిక నేరుగా పోలీసులను ఆశ్రయించడంతో... ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. ఏమాత్రం కాలయాపన చేయకుండా పోలీసులు దాడి చేయడంతో ఈ రాకెట్ గుట్టు రట్టయింది.
అమ్మాయిల కోసం షేక్ లు హైదరాబాదుకు రావడం కొత్తేమీ కాదు. ఇది ఎంతో కాలంగా జరుగుతున్న తంతే. కాకపోతే అప్పుడప్పుడు కొన్ని వెలుగులోకి వస్తాయి. చాలా మటుకు సైలెంట్ గా పూర్తయిపోతాయి. అసలు ఇది ఎందుకు జరుగుతోందన్న వివరాల్లోకి వెళ్తే... తమ విశృంఖల శృంగార వాంఛలను తీర్చుకునేందుకు గల్ఫ్ దేశాలకు చెందిన ధనిక వృద్ధ షేక్ లు హైదరాబాదుకు వస్తుంటారు. ఇలాంటి షేక్ లకు మైనారిటీ కూడా తీరని బాలికలను పాతబస్తీలోని పెళ్లిళ్ల బ్రోకర్లు పెళ్లి పేరుతో కట్టబెడుతుంటారు. ఈ పని చేసినందుకు బ్రోకర్లకు షేక్ లు బాగానే ముట్టజెబుతుంటారు. తర్వాత ఆ అమ్మాయిల జీవితం ఏమైందన్నది ఎవరూ పట్టించుకోరు.
షేక్ ల చేతిలో దారుణమైన లైంగిక దాడులకు ఈ అమ్మాయిలు గురవుతారు. కొంత మంది అమ్మాయిలను హైదరాబాదులోనే అనుభవించి ఇక్కడే వదిలేసి వెళ్లిపోతారు. మరికొంత మందిని తమతో పాటే వారి దేశాలకు తీసుకెళతారు. ఇలా షేక్ ల వెంట వెళ్లిన అమ్మాయిలు బతికారా? చనిపోయారా? అన్న విషయం కూడా తెలవకుండా మిగిలిపోతుంది. మరో దారుణ విషయం ఏమిటంటే, ఆ అమ్మాయిలను వారి తల్లిదండ్రుల అనుమతితోనే షేక్ లకు అమ్మేస్తుంటారు. పాతబస్తీ ముస్లింలలో నెలకొన్న అంతులేని పేదరికమే ఈ దారుణాలన్నింటికీ కారణమవడం బాధాకరమైన విషయం.