: నాకు ఇల్లు కంటే జైలు అంటేనే ఇష్టం!: అమెరికా ఖైదీగారి ఉవాచ
జీవితంలో ఏయే అంశాలైతే మనల్ని ఎక్కువగా ప్రభావం చేస్తాయో... వాటి ఆధారంగానే జీవిత గమనం సాగుతూ ఉంటుంది. మనం జీవితంలో లక్ష్యాలను సాధించడానికైనా, తప్పు దారిలో పయనించడానికైనా మన చుట్టూ ఉన్న పరిస్థితులే ముఖ్య భూమిక పోషిస్తాయి. ఇది బాహ్య జీవితంలో ఉన్న వారికే కాదు... జైలు జీవితం గడిపే వారికీ వర్తిస్తుందని ఓ ఖైదీ నిరూపించాడు.
"నాకు ఇల్లు కంటే జైలు అంటేనే ఇష్టం" అని ఓ ఖైదీ తనకు శిక్ష విధించిన న్యాయమూర్తికి చెప్పి అందర్నీ విస్మయానికి గురిచేశాడు. అమెరికాలోని షికాగోలో బ్యాంక్ దొంగతనానికి పాల్పడిన వాలన్ బాహెన్ (74) జైలులో ఉండటమే తనకు బాగుందని స్పష్టం చేశాడు. చిన్నతనం నుంచి చోరీలు చేస్తూ జైలు జీవితం గడిపిన వాలన్ నేరచరిత్రను 1968లో మొదలుపెట్టి... పలుమార్లు శిక్ష పడటంతో జైలు జీవితాన్ని ఎక్కువగా గడిపాడు. ఈ క్రమంలోనే అతనికి జైలు జీవితంతో అనుబంధం ఎక్కువైంది. అనంతరం 2011లో విడుదలైన వాలెన్ దక్షిణ కరోలినాలో ఉంటున్న తన సోదరి వద్ద కొంతకాలం గడిపాడు.
2013వ సంవత్సరం ఫిబ్రవరిలో నైల్స్ లోని ఓ బ్యాంక్ దొంగతనానికి పాల్పడి మరోమారు జైలుకెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అతనికి యూ.ఎస్. జిల్లా జడ్జి మూడు సంవత్సరాల శిక్షను ఖరారు చేస్తూ తీర్పునివ్వడంతో అతను సంతృప్తి వ్యక్తం చేశాడు. తనకు ఇల్లు లాంటి జైలు అంటేనే మమకారం ఎక్కువని... అందుకే మళ్లీ జైలుకు వెళ్లడానికి దొంగతనం చేశానని పోలీసులకు చెప్పాడు వాలన్.