: ‘తెనాలి రామన్’ చిత్రానికి కష్టాలు తొలగిపోయాయి
ప్రముఖ తమిళ హాస్య నటుడు వడివేలు ప్రధాన పాత్రలో నటించిన ‘తెనాలి రామన్’ చిత్రానికి కష్టాలు తొలగిపోయి శుక్రవారం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో శ్రీకృష్ణదేవరాయలను కించపరిచే సన్నివేశాలున్నాయని నిరసిస్తూ కోర్టుకెక్కిన తెలుగు సంఘాలకు, చిత్ర నిర్మాతలకు మధ్య ‘రాజీ’ కుదరడంతో చిత్రం విడుదలకు ఆటంకాలు తొలగిపోయాయి. అఖిల భారత తెలుగు సంఘాల సమాఖ్య కన్వీనర్ రామకృష్ణ టంగుటూరి, చిత్ర నిర్మాణ సంస్థ ఎజిఎస్ ఎంటర్ టైన్ మెంట్, డైరెక్టర్ ఆర్. రంగరాజన్, వడివేలు మీడియా సమావేశాన్ని నిర్వహించి వివాదాన్ని పరిష్కరించుకున్నామని ప్రకటించారు.
తెలుగు సంఘాల పిటిషన్ పై మద్రాసు హైకోర్టు తీర్పునిచ్చిన గంటకే వీరి మధ్య రాజీ కుదరడం గమనార్హం. "20 అంశాలపై మా అభ్యంతరాలు తెలియజేశాము. వీటిలో చాలా సన్నివేశాలలో డైలాగులను మ్యూట్ చేస్తామని నిర్మాతలు తెలిపారు. విడుదలకు ముందే మాకు చిత్రాన్ని చూపిస్తామని, అభ్యంతరాలు ఏవైనా ఉంటే వాటిని కూడా పరిష్కరిస్తామని నిర్మాతలు హామీ ఇచ్చారు" అని రామకృష్ణ టంగుటూరి చెప్పారు.
తెలుగు సంఘాలకు చిత్రాన్ని చూపించడానికి మొదట్లో నిరాకరించిన నిర్మాత కల్పతి ఎస్.అగోరం ఈ చిత్ర నిర్మాణానికి సుమారు రూ.18 కోట్లు ఖర్చుపెట్టారు. మే 9న రజనీకాంత్ ‘కొచ్చాడియాన్’ విడుదల కానుండడంతో ఈ లోపలే తమ సినిమాను విడుదల చేయడానికి నిర్మాత తొందరపడుతున్న కారణంగా రాజీకి వచ్చినట్లు తెలుస్తోంది. శుక్రవారం విడుదలవుతున్న ఈ చిత్రానికి తమిళనాడులో టిక్కెట్ అడ్వాన్స్ బుకింగ్ ఊపందుకుంది.