: ముఖ్యమంత్రి పదవిని వదిలేయడం తప్పే: కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ముందు తాను ప్రజలను సంప్రదించకపోవడం తప్పేనని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అంగీకరించారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీని ఓడించాలని వారణాసి ప్రజలకు పిలుపునిచ్చారు. వారణాసిలో ఆయన తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ముందుగా ఆయన ఓటర్లతో రెండు గంటల పాటు ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహించారు.
తనకు కేజ్రీవాల్ గురించి ఉన్న అనుమానాలన్నీ తొలగిపోయాయని, ఆయన సామాన్యుడిలాగే ఉన్నాడని ఘరహు రామ్ అనే రిక్షా కార్మికుడు తెలిపాడు. మే 10వ తేదీ వరకు తన ప్రచారం అంతటా తానీ ‘జన సంవాదాలు’ నిర్వహిస్తూనే ఉంటానని కేజ్రీవాల్ చెప్పారు. సీఎం పదవికి రాజీనామా చేయడంలో తాను తప్పు చేసినట్లు ప్రజలందరి ముందు బహిరంగంగా అంగీకరించారు. కాంగ్రెస్, బీజేపీలలో ఏది అధికారంలోకి వచ్చినా విద్యుత్తు, ఎరువులు, నిత్యావసరాల ధరలన్నీ పెరిగిపోతాయని ప్రజలతో ఆయన చెప్పారు.