: నా రోల్ మోడల్... గల్లా జయదేవ్: మహేశ్ బాబు
రాజకీయాలకు తానెప్పుడూ దూరాన్ని పాటిస్తానని నటుడు మహేశ్ బాబు స్పష్టం చేశారు. అదే సమయంలో తన బావ, గల్లా జయదేవ్ గురించి ఆయన తన మనసులోని భావాలను వెల్లడించారు. 'నా సోదరి పద్మను గల్లా జయదేవ్ వివాహం చేసుకున్నప్పుడు నా వయసు 13 ఏళ్లు. ఆయన నాకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి. నా రోల్ మోడల్. నన్ను చూసిన తీరు, నా పట్ల తీసుకున్న శ్రద్ధే అందుకు కారణం. అమరరాజా గ్రూప్, అమరాన్ బ్రాండ్ ను ఆయన ఏ స్థాయికి తీసుకెళ్లారో తెలిసిందే. మీడియా, పారిశ్రామిక రంగం ఆయన విజయాలను గుర్తించింది.
జయదేవ్ ఎప్పుడూ రాజకీయాల్లోకి రావాలని అంటుంటారు. కానీ, ఎందుకో నాకెప్పుడూ అర్థం కాలేదు. రాజకీయాల ద్వారానే ప్రజలను అభివృద్ధి చేయవచ్చన్నది ఆయన ఆలోచన. రాజకీయాల ద్వారా ఎక్కువ మందికి సేవ చేయవచ్చని చెబుతారు. నేను ఆయన్ని నమ్ముతున్నాను. ఆయన మార్పు తీసుకొస్తారని ఆశిస్తున్నాను. నా ఓటు, నా మద్దతు బావ గల్లా జయదేవ్ కే. గుంటూరు, ఆంధ్రప్రదేశ్, భారత్ భవిష్యత్తు కోసం మీరూ ఆయనకు మద్దతిస్తారని ఆశిస్తాను' అంటూ మహేశ్ బాబు ట్విట్టర్లో ట్వీట్ చేశారు.