: జగన్ ర్యాలీతో జనసంద్రమైన పులివెందుల
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల శాసనసభ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న సందర్భంగా పులివెందుల పట్టణం జనసంద్రమైంది. జగన్ నామినేషన్ కార్యక్రమానికి అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా పూల అంగళ్ల సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నింటిని అమల్లోకి తీసుకువస్తామన్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. అనంతరం జగన్ అభివాదం చేస్తూ అక్కడ నుంచి నామినేషన్ వేసేందుకు బయల్దేరారు. తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను ఆయన అందజేస్తారు.
అంతకు ముందు ఇడుపులపాయలో తండ్రి వైఎస్సార్ సమాధి వద్ద జగన్ పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. ఆయన వెంట సతీమణి భారతి, ఇతర కుటుంబ సభ్యులున్నారు.