: నిఘా అధికారుల బైకునే ఎత్తుకెళ్లారు!
నిఘా అధికారులు అనగానే వాళ్లకు వెయ్యి కళ్లుంటాయని, చీమ చిటుక్కుమన్నా ఇట్టే తెలిసిపోతుందని అనుకుంటాం. కానీ, ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. రెండో వైపు చూస్తే... వాళ్ల సొత్తును కూడా దొంగలు కాజేస్తున్నారు. తాజాగా ప్రముఖ పర్యాటక కేంద్రం గోవాలో ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులకు చెందిన ఒక మోటారు సైకిల్ చోరీకి గురైంది.
ఆగంతుకులు ఈ మోటారు సైకిల్ ను దొంగిలించారంటూ నగర పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు కూడా నమోదైంది. తాను ఒక బ్యాంకు వద్ద తన మోటారు సైకిల్ పార్క్ చేసి ఉంచగా, ఎవరో దాన్ని ఎత్తుకెళ్లిపోయారంటూ ఇంటెలిజెన్స్ బ్యూరో అసిస్టెంట్ డైరెక్టర్ శాంతా మడివాల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అధికారులు... ఇప్పుడిక ఆ బైక్ ఎక్కడుందా అని గాలింపు చర్యలు చేపట్టారు.