: ముంబై మోడల్ పై హైదరాబాదులో అత్యాచారం?
ముంబైలోని వెస్ట్ అంధేరీలో నివసిస్తున్న ఓ ప్రముఖ మోడల్ ను హైదరాబాదుకు చెందిన ఒక క్యాస్టింగ్ ఏజెంట్ అత్యాచారం చేసినట్లు సమాచారం. అంతర్జాతీయ శృంగార పత్రిక 'డెబొనైర్' కవర్ పేజీపై ఈ మోడల్ ఫొటో ఇటీవలే అచ్చయింది. అంతే కాకుండా, తన కెరీర్ లో ఆమె వందలాది క్యాటలాగ్ తదితర షూట్ లలో పాల్గొన్నారు. ఫేస్ బుక్ లో ఆమె స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించి సంచలనం రేకెత్తించింది.
బాధితురాలి కథనం ప్రకారం సంబంధిత క్యాస్టింగ్ ఏజెంట్ ఆ మోడల్ ను ఒక తెలుగు సినిమాలో నటించడానికి సంతకం పెట్టేందుకు హైదరాబాదు రావలసిందిగా నమ్మబలికాడు. ఆమె హైదరాబాదు చేరిన తర్వాత తనతో పాటు ఒకే గదిలో ఉండవలసిందిగా కోరి, నమ్మించిన తర్వాత ఆమెపై అక్కడే అత్యాచారం జరిపాడు. తర్వాత ఇదంతా ఒప్పందంలో భాగమేనని, గతించిన విషయమని చెప్పాడు. ఆమె తెలుగు సినిమాలో నటించడానికి ఎంపికయ్యిందని, ముంబై తిరిగి వెళ్లి, సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పుడు తిరిగి హైదరాబాద్ రావాలని ఆమెతో చెప్పాడు.
ఈ విషయాన్ని తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన ఆ మోడల్ ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికీ షేర్ చేయాలని కోరింది. ఆ క్యాస్టింగ్ ఏజెంట్ తనపై అత్యాచారం చేయడమే కాకుండా బాలీవుడ్ లో పలు కాంటాక్టులు, కనెక్షన్లు అందిస్తానని, అందుకోసం హైదరాబాదుకు చెందిన ఒక ప్రముఖ పారిశ్రామికవేత్తతో లైంగిక సంబంధాలు పెట్టుకోవాలని చెప్పినట్లు ఆమె తెలిపింది. నమ్మించి మోసం చేసిన ఆ ఏజెంట్ పేరు ఫిరోజ్ వడ్గామా. అయితే తనతో లైంగిక సేవలు అందుకోవడానికి ఫిరోజ్ ఆ పారిశ్రామికవేత్త నుంచి లక్షలాది రూపాయలు డిమాండ్ చేసినట్లు ఆ మోడల్ తర్వాత తెలుసుకుంది.
నిండా మోసపోయినట్లు గ్రహించిన ఆ మోడల్ చివరకు తనకు జరిగిన అన్యాయాన్ని ఫేస్ బుక్ అభిమానుల ముందు ఏకరువు పెట్టింది. భారతీయ చట్టాల ప్రకారం ఆమె వివరాలను, ఫొటోలను బయటపెట్టడం లేదంటూ మీడియా ఏజెన్సీలు పేర్కొన్నాయి.