: ఇవాళ ఇడుపులపాయకు వైఎస్ జగన్... రేపు నామినేషన్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఇవాళ ఇడుపులపాయకు రానున్నట్లు వైఎస్సార్సీపీ పులివెందుల నియోజకవర్గ నేత భాస్కరరెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లాలో జనభేరి కార్యక్రమంలో భాగంగా పలుచోట్ల బహిరంగ సభల్లో పాల్గొన్న అనంతరం ఇవాళ రాత్రికి వైఎస్ జగన్ ఇడుపులపాయ చేరుకుంటారని ఆయన చెప్పారు. గురువారం ఉదయం తండ్రి వైఎస్ కు నివాళి అర్పించిన అనంతరం ఇడుపులపాయ నుంచి నేరుగా స్వగృహానికి చేరుకుంటారు. రేపు ఉదయం 8.30 గంటలకు జగన్ నామినేషన్ వేసేందుకు ఇంటి నుంచి బయల్దేరుతారు.
జగన్ నామినేషన్ సందర్భంగా పులివెందుల ఆర్టీసీ బస్టాండు నుంచి భారీ ర్యాలీ ఉంటుందని భాస్కరరెడ్డి చెప్పారు. ఈ ర్యాలీ మెయిన్ బజార్, పాత బస్టాండు మీదుగా పూలంగళ్ల వరకు సాగుతుందన్నారు. అక్కడ ప్రజలనుద్దేశించి వైఎస్ జగన్ ప్రసంగించనున్నారు. అనంతరం ముద్దనూరు రోడ్డుమీదుగా తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు నామినేషన్ వేయనున్నట్లు ఆయన తెలిపారు.