: ఊసులు చెప్పాడు..ఆశలు రేపాడు.. వంచించాడు.. దాడి చేయించాడు
ప్రేమించానంటూ రంగుల లోకం చూపాడు. నువ్వులేనిదే జీవితం లేదన్నాడు. మనసులు కలిశాయి జీవితం పంచుకుందామన్నాడు. తీరా ఆ తంతు ముగిశాక ముఖం చాటేశాడు. పెళ్లి మాటెత్తితే కట్నం అడిగాడు. కట్నం ఇస్తామంటే బంధువులతో దాడి చేయించాడు. తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం లక్కవరానికి చెందిన రుద్ర సత్యానారాయణ మూర్తి ధాన్యం వ్యాపారం చేస్తాడు. వ్యాపారం కోసం రామేశ్వరంలోని అడబాల జ్యోతి తండ్రి కోసం వారింటికి వచ్చేవాడు. ఈ క్రమంలో జ్యోతిని ప్రేమిస్తున్నానని చెప్పాడు.
2011 నుంచి వీరు ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అంతా జరిగిన తరువాత పెళ్లి చేసుకోవాలని ఆమె నిలదీయడంతో తన తల్లిదండ్రులు ఒప్పుకోవాలని అన్నాడు. దీంతో ఆమె తల్లిదండ్రులు సత్యనారాయణ మూర్తి తల్లిదండ్రులను కలిశారు. 5 లక్షలు కట్నం ఇస్తే వారి పెళ్లికి అభ్యంతరం లేదని వారు తెలిపారు. దీంతో జ్యోతి తండ్రి అప్పు చేసి కట్నం సిద్ధం చేయగా, సత్యనారాయణ మూర్తి ముఖం చాటేస్తున్నాడు. దీంతో పెద్దలను ఆశ్రయించగా వారు చేతులెత్తేశారు.
దీంతో ఆమె సఖినేటిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అది మలికిపురం పరిధిలోనిదని చెప్పడంతో అక్కడ ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో గత వారం సత్యనారాయణ మూర్తి ఇంటికి నిలదీసేందుకు వెళ్లిన జ్యోతిపై అతని బంధువులు దాడి చేశారు. దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితులు చెబుతుండగా, కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.