: పాపం, పాలబుగ్గల పసివాళ్లు... రోడ్డెక్కారు!
వాళ్లంతా పట్టుమని పదేళ్లు కూడా లేని పిల్లలు. మండుటెండలో, రోడ్డు దాటలేనంత ట్రాఫిక్ మధ్య... ఒక చేతిలో బ్రోచర్, మరో చేతిలో డబ్బాతో ఒక్కొక్కరి దగ్గర డబ్బులు అడుగుతూ ప్రత్యక్షమయ్యారు. చిన్నారులను చూసి చలించిపోయిన కొందరు మానవతావాదులు, వాళ్లంతా ఎందుకిలా చేస్తున్నారో అని తీరా తీయగా... వాడిపోయిన ముఖాలతో, రోజూ తమను డబ్బులు సేకరించమని ఆటోలో ఇక్కడ వదిలివెళుతున్నారని పసివాళ్లు చెప్పారు. వారంతా ఒకే అనాథాశ్రమంలో ఉండే చిన్నారులు.
పిల్లలను రోడ్డుపై వదిలేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన వారు ఆశ్రమ నిర్వాహకురాలు క్రిష్ణమ్మను నిలదీయగా, దురుసుగా సమాధానమిచ్చింది. దీంతో హైదరాబాదు కర్మాన్ ఘాట్ గ్రీన్ పార్క్ కాలనీలోని అనాధాశ్రమానికి చెందిన రవికుమార్, రాహుల్, నితిన్, సాయితో పాటు మరో అమ్మాయిని వారు సైదాబాద్ పోలీసులకు అప్పగించారు. ఆశ్రమంలోని మరో 30 మంది విద్యార్థులు కూడా ఇలాగే మరికొన్ని ప్రాంతాల్లో నిధులు సేకరిస్తున్నట్లు చిన్నారులు చెప్పారు.