: కిరణ్ బేడీ ఢిల్లీ సీఎం అభ్యర్థి: గడ్కరీ ట్వీట్
ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో బీజేపీ మాజీ అధ్యక్షుడు గడ్కరీ కొత్త నేత పేరును తెరపైకి తెచ్చారు. గతేడాది చివర్లో జరిగిన ఎన్నికలప్పుడు పార్టీ తరపున సీఎం అభ్యర్థిగా హర్షవర్ధన్ పేరు ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పుడు అధికారానికి బీజేపీ చేరువగా వచ్చి ఆగిపోయింది. కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, రాజీనామాతో రాష్ట్రపతి పాలనలోకి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గడ్కరీ తాజాగా ఢిల్లీ సీఎం విషయమై ట్విట్టర్లో ఒక సందేశాన్ని ట్వీట్ చేశారు. 'బీజేపీ ఢిల్లీలో శాసనసభ ఎన్నికలకు సిద్ధంగా ఉంది. కేజ్రీవాల్ పై కిరణ్ బేడీయే బీజేపీ తరపున సీఎం అభ్యర్థి' అంటూ ట్వీట్ చేశారు. కిరణ్ బేడీ, కేజ్రీవాల్ ఒకప్పుడు సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే అనుంగు అనుచరులే. కిరణ్ బేడీ ఇటీవలే బీజేపీలో చేరారు. అయితే, గడ్కరీ ప్రతిపాదను బీజేపీ సమర్థించలేదు. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయంగా తేల్చి పడేసింది.