: నేడు కరీంనగర్ లో సోనియా సభ
కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియంలో ఈ రోజు టి. కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు జరగనున్న ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ హాజరుకానున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం ఆమె తొలిసారిగా తెలంగాణకు వస్తున్నారు. ఇదే స్టేడియంలో మార్చి 11,2004, ఏప్రిల్ 7, 2009 లలో జరిగిన ఎన్నికల సభల్లో పాల్గొని తెలంగాణ ఆకాంక్షను గౌరవిస్తామని ఆమె హామీ ఇచ్చారు. సోనియా సమక్షంలో కాంగ్రెస్ లో వివిధ పార్టీలకు చెందిన నాయకులు భారీగా చేరనున్నట్టు సమాచారం. సభా ప్రాంగణంలో అమరవీరుల కుటుంబసభ్యులను సోనియా కలవనున్నారు.
ఈ పర్యటనలో భాగంగా సోనియా త్రివేండ్రం నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 3.15 గంటలకు హకీంపేట ఎయిర్ స్టేషన్ చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్ లో 3.55 గంటలకు కరీంనగర్ చేరుకుంటారు. 45 నిమిషాల పాటు సభలో పాల్గొన్న అనంతరం తిరిగి హెలికాప్టర్ లో హైదరాబాద్ చేరుకుని, విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. సోనియాగాంధీతో పాటు ఈ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ పాల్గొననున్నారు .