: సీఎం ఉన్న హోటల్ లో కూలిన లిఫ్టు... ప్రమాదమా? కుట్రా?
జార్ఖండ్ రాజధాని రాంచీలోని ఒక హోటల్ లో లిఫ్ట్ ఉన్నట్టుండి కుప్పకూలిపోవడంతో ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ రాజకీయ సలహాదారు సహా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిలో ఒక సీనియర్ జర్నలిస్టు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి సోరేన్ వేరే లిఫ్ట్ లో కిందకి రావడంతో ప్రమాదం తప్పింది.
ముఖ్యమంత్రి, ఆయన రాజకీయ సలహాదారు, మరికొందరు సీనియర్ రాజకీయ నేతలు ఒక హోటల్ లోని ఆరో అంతస్తులో కీలక సమావేశం జరిపారు. ఈ సమావేశం తరువాత కిందకి వస్తూండగా ఈ ప్రమాదం జరిగింది. హుటాహుటిన అధికారులు హోటల్ ను తనిఖీ చేసి దర్యాప్తుకు ఆదేశించారు.
తమాషా ఏమిటంటే ముఖ్యమంత్రి సోరేన్ గత వారం ఇదే హోటల్ లో ఒక వారం రోజుల పాటు బస చేశారు. అప్పుడు కూడా ఒక లిఫ్ట్ దాదాపు ఇదే విధంగా కుప్పకూలింది. దాంతో అధికారులు ఇప్పుడు దీని వెనుక కుట్ర కోణం ఏమైనా ఉందా? అన్న అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఇంతకీ ఒక సీఎం స్థాయి వ్యక్తి ఒక హోటల్ లో అన్ని రోజుల పాటు ఎందుకున్నారన్నది ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది.