: భర్త ఎమ్మెల్యే... భార్య కూరగాయల వ్యాపారి!


ఒక్కసారి ఎమ్మెల్యే పదవి చేపడితేనే తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తులు గడించే నాయకులున్న ఈ కాలంలో అక్కడక్కడా నిస్వార్థ నాయకులున్నారనడానికి ఇదే ఉదాహరణ. భర్త మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా చేశారు. ఆయన భార్య మాత్రం ఇప్పటికీ నిత్యం మార్కెట్ కు వెళ్లి కూరగాయలు అమ్ముకుంటూ... రోజుకు రెండు, మూడు వందల రూపాయలు సంపాదిస్తున్నారు. జార్ఖండ్ లోని బార్కగావ్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే లోక్ నాథ్ మహతో భార్య మొలానీ దేవి ఇప్పటికీ కూరగాయలు అమ్ముకుంటూ జీవిస్తున్నారు. అయితే సంపాదన కోసం ఆమె ఈ పని చేస్తోందనుకొంటే మాత్రం ‘పప్పు’లో కాలేసినట్లే! భర్త ఎమ్మెల్యే కాక ముందు నుంచి వారి వ్యాపారం ఇదే. ఎంత ఎత్తుకు వెళ్లినా మూలాలను మరవకూడదనే ఆమె కూరగాయల వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. లోక్ నాథ్ తన ఎన్నికల అఫిడవిట్ లో రూ. 2.67 కోట్ల మేర కుటుంబ ఆస్తులను చూపించడం గమనార్హం.

గతంలో బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న 69 ఏళ్ల లోక్ నాథ్ ఈసారి టికెట్ రాకపోవడంతో ఆ పార్టీని వీడి ఓ యూనియన్ తరపున హజారీబాగ్ ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్నారు. ఇక్కడ బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ యశ్వంత్ సిన్హా కుమారుడు జయంత్ బరిలో ఉన్నారు. అయితే నియోజకవర్గ ప్రజలకు యశ్వంత్ సిన్హా చేసిందేమీ లేదని, ఇప్పుడు ఆయన వారసుడొచ్చి కూడా ఏమీ చేయడని లోక్ నాథ్ ఆరోపిస్తున్నారు. ఆయనకు మద్దతుగా మొలానీ దేవి కూడా ప్రచారంలోకి దిగారు. వ్యవసాయం చేసుకుంటూ, కూరగాయలు అమ్ముకుంటూ సాధారణ జీవితం గడుపుతున్న తమను ప్రజలంతా తప్పక ఆదరిస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News