: పాక్ ఆటగాళ్లకు ఇదే సరైన సమయం: వసీం అక్రం
2008 ముంబయి పేలుళ్ల తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతినడంతో ఆ ప్రభావం భారత్, పాక్ క్రికెట్ పై పడింది. దీంతో పాకిస్థాన్ తో అంతర్జాతీయ టోర్నీల్లో తప్ప ద్వైపాక్షిక టోర్నీలకు బీసీసీఐ వారితో ఆడేందుకు అనుమతించడం లేదు. ఐపీఎల్ లో ఆడాలని చాలా మంది పాక్ క్రికెటర్లు ఉత్సాహం చూపించినప్పటికీ బీసీసీఐ అందుకు అనుమతించ లేదు. ఈ కారణంగా పాక్ ఆటగాళ్లను ఐపీఎల్ కు దూరమయ్యారు.
కాగా తాజాగా పాక్ మాజీలకు ఆరేళ్ల విరామం తరువాత ఐపీఎల్ 7లో ప్రాతినిధ్యం కల్పించనున్నారు. ప్రస్తుతం పాక్ జాతీయ జట్టుకు ఆడుతున్న, రిటైర్ అయిన సీినియర్ ఆటగాళ్లకు బీసీసీఐ మినహాయింపు ఇచ్చింది. దీంతో పాక్ ఆటగాళ్లు ఐపీఎల్ లో పాల్గొనడానికి ఇది సరైన సమయమని మాజీ కెప్టెన్ వసీం అక్రం పేర్కొన్నాడు. ఐపీఎల్ ద్వారా దేశ వ్యాప్తంగానే కాక ప్రపంచవ్యాప్తంగా అనేక మంది అభిమానులకు దగ్గర కావచ్చని పాక్ కు చెందిన ఓ వెబ్ సైట్ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డాడు.
భారత్, పాక్ మ్యాచ్ అంటేనే అభిమానులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తారని, ఇరు దేశాల ఆటగాళ్లకు మద్దతు కూడా భారీ ఎత్తున లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ ద్వారా భవిష్యత్తులో భారత్ తో ఆడే అన్ని మ్యాచుల్లో పాక్ ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన చూపించవచ్చనే ఆశాభావాన్ని అక్రం వ్యక్తం చేశాడు.