: గబ్బర్ సింగ్ -2 చిత్రానికి పవన్ రెడీ
'నాకు కాస్త తిక్కుంది. దానికో లెక్కుంది' అంటూ పూర్తి స్థాయి తన మార్కు డైలాగులతో చాలా కాలం తర్వాత ప్రేక్షకులకు వినోద విందు ఇచ్చాడు పవన్ కల్యాణ్. మళ్లీ త్వరలో ఈ తరహా డైలాగుల పంట పండనుంది. చాలా ఏళ్ల తర్వాత పవన్ కల్యాణ్ స్టార్ డమ్ ను తిరిగి టాప్ లెవల్ కు తీసుకెళ్లిన చిత్రం 'గబ్బర్ సింగ్'. ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో మళ్లీ పవన్ కల్యాణ్ టాప్ హీరోగా కుదురుకున్నారు. ఈ ఉత్సాహాన్ని చూసిన చిత్ర నిర్మాత బండ్లగణేశ్ త్వరలోనే గబ్బర్ సింగ్ -2 చిత్రాన్ని తీస్తామని అప్పుడే ప్రకటించారు.
కానీ, గబ్బర్ సింగ్ -2 చిత్రాన్ని పవన్ కల్యాణ్ స్వయంగా తన బేనర్ లోనే నిర్మించాలని అనూహ్యంగా నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని సమాచారం. కేవలం దర్శకుడు, సాంకేతిక నిపుణులు, నటీనటుల విషయమే తేలాల్సి ఉందంటున్నారు. అతి త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలను పవన్ కల్యాణ్ ప్రకటిస్తారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. దీంతో, ప్రేక్షకులు, అభిమానులకు గబ్బర్ సింగ్ ను సరికొత్తగా చూసే అవకాశం దక్కనుంది.