: కార్యకర్తల నిర్ణయమే శిరోధార్యం: కాసు
కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయాలా? వద్దా? అనేది కార్యకర్తల సమావేశం అనంతరం నిర్ణయం తీసుకుంటానని కాంగ్రెస్ నేత కాసు వెంకట కృష్ణారెడ్డి అన్నారు. నరసరావుపేట ఎంపీ స్థానం నుంచి తను, అసెంబ్లీ స్థానం నుంచి తన కుమారుడు పోటీ చేయాలని అధిష్ఠానం కోరుతోందని ఆయన తెలిపారు. తరతరాలుగా తమ కుటుంబం కాంగ్రెస్ పార్టీలోనే ఉందని, అయినప్పటికీ కార్యకర్తల నిర్ణయమే శిరోధార్యమని ఆయన చెప్పారు.
హైదరాబాదులో ఇవాళ కాసు వెంకట కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దేవాలయం లాంటిదని అన్నారు. 1927 నుంచి కాంగ్రెస్ పార్టీలోనే తమ కుటుంబం ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అలాగే నర్సరావుపేట నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోటని ఆయన అన్నారు. అలాంటి నియోజకవర్గంలో తనను, తన కుమారుడిని పోటీ చేయమని అధిష్ఠానం చెప్పిందని ఆయన అన్నారు. కానీ తన కుటుంబాన్ని తరతరాలుగా అభిమానించే కార్యకర్తలు ఉన్నారని, వారితో చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటానని కాసు తేల్చి చెప్పారు.