: ఇది నీరో చక్రవర్తి పాలనలా ఉంది: టీడీపీ
రాష్ట్రం ఓవైపు సమస్యల సుడిగుండంలో చిక్కుకుని విలవిల్లాడుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ నీరో చక్రవర్తి పాలనను గుర్తుకు తెస్తోందని టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు. ఓవైపు సర్ ఛార్జీ విషయంలో ప్రశ్నిస్తున్న విపక్షాలపై ఎదురుదాడి చేస్తున్న ప్రభుత్వం.. తాజాగా విద్యుత్ ఛార్జీల పెంపు ప్రకటించడం దారుణమని టీడీపీ నేత ధూళిపాళ్ళ నరేంద్ర వ్యాఖ్యానించారు.
ప్రజల పక్షం వహించాల్సిన ఈఆర్సీ కూడా సర్కారుకు వంతపాడుతూ కీలుబొమ్మగా తయారైందని విమర్శించారు. ప్రభుత్వం తాజా ఛార్జీలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే, ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.