: ములాయం సింగ్ వ్యాఖ్యలపై మండిపడిన జయప్రద
సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ పై రాష్ట్రీయ లోక్ దళ్ అభ్యర్థి జయప్రద మండిపడ్డారు. అత్యాచార నిరోధ చట్టాలపై ఇటీవల ములాయం చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆగ్రా పర్యటనలో జయప్రద మీడియాతో మాట్లాడారు. ములాయం సింగ్ వ్యాఖ్యలు మహిళల పట్ల ఆయన వైఖరికి నిదర్శనమని ఆమె అన్నారు. ములాయం వ్యాఖ్యలకు ప్రజలు ఓట్ల ద్వారా తగిన సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు.
అత్యాచార కేసులో శిక్షలకు సంబంధించి ‘సాధారణంగా అబ్బాయిలు తప్పు చేస్తుంటారు. దానికి మరణశిక్ష విధిస్తారా?’ అంటూ ఎస్పీ అధినేత ములాయం గతంలో వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు దేశంలో తీవ్ర చర్చకు, విమర్శలకు దారి తీసిన విషయం విదితమే.