: బీజేపీ పార్లమెంటరీ బోర్డులో మోడీకి స్థానం..?
గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ ప్రమోషన్ కు రంగం సిద్ధమవుతోందా? ఆయన ప్రధాన మంత్రి అభ్యర్థిత్వాన్ని ఇక ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సిన తరుణం ఆసన్నమైందని బీజేపీ భావిస్తోందా? ఈ ప్రశ్నలకు జవాబులు దొరకాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. పార్లమెంటరీ బోర్డులో మోడీని తీసుకోవాలని బీజేపీ భావిస్తున్నట్టు సమాచారం. పార్లమెంటరీ బోర్డు అంటే బీజేపీలో అత్యున్నత స్థాయిలో నిర్ణయాలు తీసుకునే కమిటీ.
ఈ బోర్డులో స్థానం కల్పించడం ద్వారా మోడీని జాతీయ రాజకీయాల్లో ముందుకు తీసుకెళ్ళాలన్నది కమలనాథుల యోచనగా కనిపిస్తోంది. 2014 ఎన్నికల నాటికి మోడీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళడమే బీజేపీ ఉద్ధేశమని అర్థం అవుతోంది. కాగా, పార్లమెంటరీ బోర్డు తుది జాబితాను ఈ రోజు రాత్రి పొద్దుపోయాక ప్రకటించే అవకాశం ఉంది. ఆరేళ్ళ కిందట మోడీ ఈ బోర్డులో సభ్యుడే అయినా, తదనంతరం ఆయన గుజరాత్ కే పరిమితం అయ్యారు.