: భార్యల కోసం బాలీవుడ్ భర్తల పాట్లు
ఈసారి ఎన్నికల్లో పలువురు బాలీవుడ్ నటీమణులు బరిలో ఉండటంతో వాళ్ల భర్తలకు ఎన్నికల పాట్లు తప్పడం లేదు. ఇప్పటికే కిరణ్ ఖేర్ తరపున ఆమె భర్త అనుపమ్ ఖేర్ ప్రచార పర్వంలో తలమునకలై ఉన్నారు. కిరణ్ గెలుపు కోసం అనుపమ్ ఖేర్ సుమారు నెల రోజుల పాటు తన సినిమా షూటింగులన్నీ రద్దు చేసుకుని మరీ ప్రచారం సాగిస్తున్నారు. చండీగఢ్ నుంచి కేంద్ర మాజీ మంత్రి పవన్ కుమార్ బన్సల్ మీద కిరణ్ ఖేర్ బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న విషయం తెలిసిందే. ఇదే స్థానం నుంచి మరో బాలీవుడ్ నటి గుల్ పనాగ్ ఆమ్ ఆద్మీ పార్టీ తరపున రంగంలో ఉన్నారు.
ఇక మరో వైపు ఉత్తరప్రదేశ్ లోని మధుర నుంచి పోటీ చేస్తున్న అలనాటి అందాల తార హేమమాలిని కూడా తన భర్తను ప్రచారంలోకి దించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. హేమమాలిని భర్త, ఒకప్పటి టాప్ హీరో ధర్మేంద్ర వచ్చే వారం నుంచి ప్రచారంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా హేమమాలినే ప్రకటించారు. హేమమాలినికి మద్దతుగా ఆమె పెద్ద కూతురు ఈషా డియోల్ ఇప్పటికే ప్రచారంలో పాల్గొంటుండగా, చిన్నకూతురు అహానా కూడా ప్రచారం చేస్తోంది. ధరమ్ జీ మరికొన్ని రోజుల్లో వస్తారని హేమమాలిని చెప్పారు.