: ఐపీఎల్ 'గాయ'పడింది


క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించేందుకు మరికొద్ది రోజుల్లో ఆరంభం కానున్న ఐపీఎల్ ఆరో సీజన్ ను గాయాల బెడద వేధిస్తోంది. ఒక్క మ్యాచ్ కూడా జరగక ముందే పలువురు స్టార్లు ఐపీఎల్ కు దూరమయ్యారు. దీంతో, ఆయా ఫ్రాంచైజీల్లో ఆందోళన మొదలైంది. కోట్లు పోసి కొన్న ఆటగాళ్ళు గాయాలబారిన పడడంతో వారికి ప్రత్యామ్నాయం వెతకడంలో జట్ల యాజమాన్యాలు తలమునకలై ఉన్నాయి. శనివారం నాటికి మొత్తం 8 మంది ఆటగాళ్ళు గాయాల కారణంగా దూరమైనట్టు తెలుస్తోంది.

కాగా, అన్ని జట్లలోకెల్లా ఢిల్లీ డేర్ డెవిల్స్ ది దారుణమైన పరిస్థితి. ఈ ఒక్క జట్టు నుంచే ముగ్గురు కీలక ఆటగాళ్ళు గాయంతో వైదొలిగారు. స్టార్ బ్యాట్స్ మన్ కెవిన్ పీటర్సన్ మోకాలికి గాయం కాగా, కివీస్ హార్డ్ హిట్టర్ జెస్సీ రైడర్ దుండగులు చేతిలో చావుదెబ్బలు తిని ప్రస్తుతం కోమాలోంచి బయటపడ్డాడు. రైడర్ ఇప్పట్లో కోలుకునే సూచనలు కనిపించడంలేదు. దీంతో ఇద్దరు ఉద్ధండులైన బ్యాట్స్ మెన్ సేవలు కోల్పోవడంతో డేర్ డెవిల్స్ టోర్నీ ఆరంభానికి ముందే ఢీలా పడిపోయింది.

అయితే, సెహ్వాగ్ తన సత్తా నిరూపించుకోవాలన్న కసిమీద ఉండడం ఆ జట్టుకు కొండంత అండ. సెహ్వాగ్ ఇటీవలే టీమిండియా నుంచి ఉద్వాసనకు గురైన సంగతి తెలిసిందే. ఇక యువ పేసర్ వరుణ్ ఆరోన్ కూడా వెన్ను గాయంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఢిల్లీ బౌలింగ్ కూడా బలహీనపడనుంది. వీళ్ళే కాకుండా, వెన్నెముక గాయంతో మైకేల్ క్లార్క్ (పుణే వారియర్స్) టోర్నీ మొత్తానికి దూరం కాగా, నయా సంచలనం శిఖర్ ధావన్ (సన్ రైజర్స్ హైదరాబాద్) వేలి గాయంతో తొలి మ్యాచ్ కు అందుబాటులో ఉండడంలేదు.

తుంటి భాగంలో వాపుతో ఇబ్బంది పడుతున్న దక్షిణాఫ్రికా మిడిలార్డర్ యోధుడు ఫాఫ్ డు ప్లెసిస్ గైర్హాజరీ చెన్నయ్ సూపర్ కింగ్స్ కు చేదు వార్తే. ఇక సఫారీ ఎడమచేతివాటం ఆటగాడు జేపీ డుమినీ (సన్ రైజర్స్), భారత కొత్త మిస్టర్ డిపెండబుల్ ఛటేశ్వర్ పుజారా (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) కూడా వేలి గాయంతో తప్పుకున్నాడు. 

  • Loading...

More Telugu News