: పని చేయమన్నాడని కొడునుకు కొట్టి చంపిన తండ్రి
పనీపాటా లేకుండా తిరుగుతున్న తండ్రిని, ఎంత కాలం ఖాళీగా ఉంటారు? ఏదైనా పని చూసుకోండంటూ చెప్పడమే ఆ కొడుకు చేసిన తప్పు. నన్ను పని చేయమంటాడా? పని చేయడం కంటే వాడ్ని చంపేయడమే సులభం అనుకున్నాడో ఏమో కానీ, కన్న కొడుకుని పొట్టనబెట్టుకున్నాడా కసాయి తండ్రి. ఢిల్లీలోని డబ్రి ప్రాంతంలో 21 ఏళ్ల వివేక్ రక్తపు మడుగులో ఉండగా పొరుగునున్న ఓ వ్యక్తి చూసి ఆసుపత్రికి తరలించాడు. చికిత్స పొందుతుండగా వివేక్ మరణించాడు. దీంతో వివేక్ తండ్రి కుల్ దీప్ ని ప్రశ్నించగా... తనను పని చూసుకోవాలంటూ విసిగిస్తున్నాడని, అందుకే చంపేశానని తెలిపాడు. దీంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు. కుల్ దీప్ దాడి చేసిన రాడ్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.