: ఔను... వారు రెండు రాష్ట్రాల్లో ఓటేశారు!
ఆంధ్రా, మహారాష్ట్ర వివాదాస్పద సరిహద్దులోని రెండు గ్రామాల పంచాయతీలైన పరందోళి, అంతాపూర్ ప్రజలు రెండ్రోజుల్లో రెండు రాష్ట్రాల్లో రెండుసార్లు ఓటుహక్కును వినియోగించుకున్నారు. గురువారం నాడు మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాకు చెందిన పార్లమెంటు ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ఓటు వేశారు. అంతాపూర్ గ్రామ పంచాయతీకి చెందిన ఓటర్లకు బోలాపటార్ లో, బోలా పటార్ కు చెందిన ఓటర్లు అంతాపూర్ లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీంతో రవాణా సౌకర్యం కోసం ఓటర్లు ఇబ్బంది పడ్డారు.
ఉదయం ఏడు గంటలకే పోలింగ్ ప్రారంభం కాగా... బోలాపటార్ లో 8.30 వరకు ఒక్కరూ ఓటు వేయలేదు. అనంతరం ఒక్కొక్కరుగా వచ్చారు. పోలింగ్ కేంద్రాలు దూరంగా ఉండటంతో ఆలస్యం జరిగింది. మరోవైపు అనేకమంది కాలినడకన రావడంతో ఇబ్బంది పడ్డారు. చంద్రాపూర్ ఎంపీ ఎన్నికల్లో ఎడమచేయి చూపుడు వేలుకి సిరాచుక్క వేయగా, శుక్రవారం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎడమచేయి మధ్యవేలికి సిరా చుక్క వేశారు. రెండు గ్రామ పంచాయతీల్లో మొత్తం 2,585 ఓటర్లు ఉన్నారు. ఇందులో పరందోళి గ్రామ పంచాయతీలో 1,317 మంది ఓటర్లకు గాను 1071 మంది ఓటు వేశారు. 81.32 శాతం పోలింగ్ నమోదైంది. అంతాపూర్ గ్రామ పంచాయతీలో 1,268 ఓటర్లకు గాను 922 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. 72.71 శాతం పోలింగ్ నమోదైంది.