: ఇంతకీ సినీ నటి రమ్య తండ్రి ఎవరు?


ప్రముఖ సినీ నటి, కర్ణాటకలోని మాండ్య లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి రమ్య తండ్రిని తానేనని ప్రకటించాలని కోరుతూ ఒక వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. రమ్య తన కుమార్తె అని, ఆమె తల్లి రంజిత తన భార్య అని రుజువు చేయడానికి తన వద్ద ఆధారాలున్నాయని పేర్కొంటూ బీసీ వెంకటేశ్ అనే వ్యక్తి బెంగళూరులోని సిటీ సివిల్, సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. రమ్య తండ్రిని తానేనని కోర్టు ఆదేశాలు జారీ చేయాలని ఆయన తన పిటిషన్ లో అర్థించాడు. 1981 జూన్ 22న తాను రంజితను ఒక గుడిలో పెళ్లి చేసుకున్నానని వెంకటేశ్ తెలిపాడు. 1982 నవంబర్ 29న సదాశివనగర్ లోని ఐడియల్ నర్సింగ్ హోమ్ లో రమ్య జన్మించిందని ఆయన వివరించాడు. కాగా, నామినేషన్ పత్రాలలో రమ్య తన తల్లి పేరును మాత్రమే ప్రస్తావించారని ఆయన చెప్పాడు.

‘‘రమ్యకు ఐదేళ్లు వచ్చేవరకు మేమంతా కలిసే ఉన్నాం. నాకు యాక్సిడెంట్ జరిగిన తర్వాత రమ్యను తీసుకుని రంజిత వెళ్లిపోయింది. అప్పటి నుంచి నాతో ఉండేందుకు ఇష్టపడలేదు. తిరిగి రావాలని ఎన్నిసార్లు ప్రాధేయపడినా ఆమె తిరిగిరాలేదు. 2005లో నా మిత్రుల ద్వారా రమ్య నా కుమార్తె అని తెలిసింది. వాళ్లను కలవడానికి వారి ఇంటికి వెళితే రంజిత నన్ను లోపలకు అనుమతించలేదు. రమ్యకు తనకంటూ ఒక గుర్తింపు వచ్చిందని, తండ్రిగా నిన్ను ఆమె స్వీకరించలేదని రంజిత చెప్పింది’’ అని వెంకటేశ్ తన పిటిషన్ లో ఆరోపించాడు.

రంజిత, రమ్యలను తన వద్దకు పంపాలని ఆదేశించాలని కోరుతూ 2006లో ఫ్యామిలీ కోర్టులో కూడా ఒక కేసు దాఖలు చేశానని వెంకటేశ్ తెలిపాడు. తాను రమ్య తండ్రినని సమాజానికి తెలియాలనే కేసు వేశానంటున్నాడు వెంకటేశ్.

  • Loading...

More Telugu News