: తెలంగాణకు ‘స్టార్ కాంపెయినర్లు’ వస్తున్నారు!
తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ అధిష్ఠానం కృత నిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ పీసీసీ ప్రచార వ్యూహాలపై దృష్టి సారించకపోవడంపై గుర్రుగా ఉంది. ప్రచారం తీరు ఇలాగే కొనసాగితే తెలంగాణలో తన కొంప మునుగుతుందని ఆందోళన చెందుతోంది. దీంతో స్వయంగా రంగంలోకి దిగేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ సిద్ధమయ్యారు. ఈ మేరకు 16వ తేదీన కరీంనగర్ లో నిర్వహించే బహిరంగ సభకు సోనియా హాజరవుతున్నారు. ఆ మరునాడు (17వ తేదీన) రాహుల్ సభ ఏర్పాటు చేయాలని భావించినా అది 21కి వాయిదా పడింది.
కాంగ్రెస్ ఈసారి తెలంగాణలో విస్తృత ప్రచారం చేయాలని డిసైడ్ అయింది. ప్రధాని మన్మోహన్ తో పాటు మాజీ క్రికెటర్ అజారుద్దీన్, సినీ నటి నగ్మాను కూడా రంగంలోకి దింపాలని అధిష్ఠానం నిర్ణయించింది. ఈ వ్యూహంలో భాగంగా ఈ నెల 30న పోలింగ్ జరిపే లోపు వీలైనన్ని ఎక్కువ సభలు నిర్వహించాలని నిర్ణయించింది.
ఎన్నికల ప్రచారం కోసం 40 మంది ‘స్టార్ కాంపెయినర్ల’ను అధిష్ఠానం గుర్తించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్, కుంతియా, కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, వయలార్ రవి, గులాంనబీ ఆజాద్, జైపాల్ రెడ్డి, సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్ లను నియమించింది. వీరితో పాటు పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, శ్రీధర్ బాబు, గీతారెడ్డి, డీకేఅరుణ, చిన్నారెడ్డి, ఫరీదుద్దీన్, మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్, వివేక్, పొన్నాల కోడలు వైశాలి, వీహెచ్ క్రాంతి, ప్రేమ్ లాల్, రాపోలు ఆనంద భాస్కర్, వి.హనుమంతరావు, ఎం.ఏ.ఖాన్, రేణుకా చౌదరి, షబ్బీర్ అలీ, ధర్మపురి శ్రీనివాస్, పొంగులేటి సుధాకర రెడ్డి, సిరాజుద్దీన్, ఎస్సీ సెల్ ఛైర్మన్ కృష్ణ, ఎస్టీ సెల్ అధ్యక్షుడు జగన్ లాల్ నాయక్, మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మర్రి శశిధర్ రెడ్డిలను నియమించింది. తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి సిద్ధం కావాల్సిందిగా వీరికి సూచించింది.