: ఈ గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు
ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. ఓవైపు పోలింగ్ శాతం గతం కంటే పెరిగితే... మరోవైపు తమ సమస్యలను పరిష్కరించేంతవరకు ఎన్నికలను బహిష్కరిస్తున్నామంటూ ఓటర్లు అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని గ్రామాల ఓటర్లు ఈ రోజు జరుగుతున్న ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలోని ఎన్ఎస్పీ కాలనీ వాసులు... తమ ఓట్లను మరో బూత్ కు మార్చారని ఆరోపిస్తూ ఎన్నికలను బహిష్కరించారు. మరోవైపు, తమ గ్రామాన్ని అభివృద్ధి చేయలేదంటూ... విశాఖపట్నం జిల్లా డుంబ్రిగూడ మండలం పుట్టి గ్రామస్తులు పోలింగ్ బూత్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు.
పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం భట్లమగుటూరు గ్రామస్తులు కూడా పోలింగ్ ను బహిష్కరించారు. తమ గ్రామంలో కనీస అవసరాలను తీర్చేంతవరకు ఎన్నికలకు దూరంగా ఉంటామని భట్లమగుటూరు గ్రామస్తులు తెగేసి చెప్పారు. అలాగే, తమ గ్రామానికి ప్రత్యేక గ్రామ పంచాయతీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ... మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం కిష్టంపల్లి గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు.