: అజ్ఞాతంలోకి మోడీ భార్య!
తనకు పెళ్లయిందని, భార్య పేరు జశోదాబెన్ అని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ నామినేషన్ పత్రాల్లో పేర్కొనడంతో మీడియా కళ్లు ఆయన భార్యపై పడ్డాయి. చాలా మంది కెమెరాలు పట్టుకుని ఆమె నివాసం ఉంటున్న వాద్ నగర్ కు క్యూ కడుతున్నారు. మోడీకి, యశోదకు 17 ఏళ్ల వయసులోనే పెళ్లి కాగా, వెంటనే వారు విడిపోయిన విషయం తెలిసిందే. నాటి నుంచీ వారిద్దరిలో ఎవరూ తమ వివాహం గురించి ఏనాడు బయటకు చెప్పింది లేదు. జశోదాబెన్ కూడా ఒంటరి జీవితాన్నే గడిపారు. ఉన్నట్లుండి మీడియా తాకిడి మొదలవడంతో ఆమె అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు ఆమెను రహస్య ప్రదేశానికి పంపించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, జశోదాబెన్ మరో 40 మంది మహిళలతో కలసి చార్ ధామ్ యాత్రకు వెళ్లినట్లు కొందరు చెబుతున్నారు. చార్ ధామ్ యాత్ర మొదలు కావడానికి ఇంకా 25 రోజులకుపైనే సమయం ఉంది.