: మోడీయే కాబోయే ప్రధాని: అద్వానీ కుమార్తె ప్రతిభ


ప్రధాని నరేంద్ర మోడీ అభ్యర్థిత్వంపై ఎల్.కె.అద్వానీకి కొన్ని పట్టింపులు ఉండొచ్చు. కానీ, 'గుజరాత్ ముఖ్యమంత్రి కచ్చితంగా అత్యున్నత పదవిని అలంకరిస్తారని, అది దేశానికి మంచిది' అని అద్వానీ తనయ ప్రతిభ భావిస్తున్నారు. మార్పునకు ఇదే సమయమని, ఎన్నికల తర్వాత దేశప్రజలు మార్పును చూస్తారని ప్రతిభా అద్వానీ అన్నారు. న్యూఢిల్లీలోని లోధీ ఎస్టేట్ ప్రాంతంలోని పోలింగ్ స్టేషన్ వద్ద తన ఓటుహక్కును వినియోగించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. "దేశానికి మంచి జరిగేలా నరేంద్ర మోడీ ప్రధాని పదవిని చేపడతారనడంతో ఎలాంటి సందేహం లేదు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది" అని ఆమె తెలిపారు. దేశ ప్రజలు సుస్థిరమైన ప్రభుత్వం కోసం బీజేపీ వైపు చూస్తున్నారని ఆమె అన్నారు.

"భారత్ కు ఒక సుస్థిర ప్రభుత్వం రావాలని నేను కోరుకుంటున్నా. అందుకే ఇవాళ ఓటు వేశాను. బీజేపీ 272 పైచిలుకు స్థానాలను కైవసం చేసుకుంటుందనే ధీమాతో ఉన్నాను" అని అద్వానీ కుమార్తె తెలిపారు. భారీ అవినీతిలో యూపీఏ కూరుకుపోయిందని ఆమె ఆరోపించారు. ప్రజలు సుపరిపాలన వైపు మొగ్గు చూపుతున్నారని ప్రతిభ చెప్పారు.

"ఇవాళ అవినీతి అతిపెద్ద అంశమై పోయింది. కొద్ది సంవత్సరాలుగా దేశం భారీ అవినీతిని చూస్తోంది. అవినీతికి వ్యతిరేకంగా దాదా (అద్వానీ) పలు ప్రచార కార్యక్రమాలను చేపట్టారు. ముడుపులు, నల్లధనానికి వ్యతిరేకంగా ఆయన జన చేతన యాత్ర కూడా చేపట్టారు" అని ప్రతిభ వివరించారు.

  • Loading...

More Telugu News