: జీతాలివ్వలేని స్థితి నుంచి సీమాంధ్ర ప్రారంభమవుతుంది: చంద్రబాబు
ఉద్యోగులకు జీతాలివ్వలేని స్థితి నుంచి సీమాంధ్ర ప్రారంభమవుతుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చెప్పారు. ప్రజల్లో కసి, కోపం, బాధ వున్నాయని ఆయన అన్నారు. ఇవాళ చంద్రబాబు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... యువత దారి తప్పితే సంఘ విద్రోహ శక్తులుగా మారే ప్రమాదం ఉందని, ఇదే విషయాన్ని ‘జనసేన’ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా బాబు గుర్తుచేశారు.
దేశంలో విమానాశ్రయాలు కట్టినవాళ్లు, ఐటీ, ఫార్మా కంపెనీలు పెట్టినవారు తెలుగువారేనని చంద్రబాబు పేర్కొన్నారు. టెక్నాలజీ వల్ల అభివృద్ధి జరుగుతుందని తాను ఎప్పుడూ నమ్ముతానని, అందుకే సాంకేతికతను ప్రోత్సహించానని ఆయన తెలిపారు. ఎన్నికల్లో బరిలోకి దిగే అభ్యర్థుల ఎంపికలోనూ టెక్నాలజీ సహాయాన్ని తీసుకుని ప్రజాభిప్రాయాన్ని సేకరించామని చంద్రబాబు తెలిపారు.
సంక్షోభంలో ఉన్నామని సీమాంధ్ర ప్రజలు దిగులు పడవద్దని, ఆంధ్రప్రదేశ్ ని మరో సింగపూర్ గా తీర్చిదిద్దుతానని బాబు హామీ ఇచ్చారు. వ్యవసాయాన్ని అగ్రభాగాన నిలిపి, ప్రపంచానికే ఆంధ్రపదేశ్ ని అన్నదాతగా మారుస్తామని ఆయన వెల్లడించారు. దేశ భవిష్యత్, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఎన్డీయేతో పొత్తు పెట్టుకున్నామని బాబు వివరించారు.