: ప్రతి వారం ఓ గ్యాంగ్ స్టర్ కథతో ‘ఎన్ కౌంటర్’
వీక్షకులు గ్యాంగ్ స్టర్ల కథలంటే ఎప్పడూ ఆసక్తి చూపుతారు. అది వెండి తెరపై కావచ్చు, బుల్లి తెరపై కావచ్చు. ఇప్పటికే ఇటువంటి కథలతో వచ్చిన సినిమాలు ప్రేక్షకుల్ని అమితంగా ఆకర్షించడమే కాకుండా, బుల్లితెరను కూడా ఈ తరహా కథలు ఆకట్టుకుంటూనే ఉంటున్నాయి. తాజా సోనీ ఎంటర్ టైన్ మెంట్ టెలివిజన్ ‘ఎన్ కౌంటర్’ పేరుతో శుక్రవారం నుంచి వీక్షకుల ముందుకు రానుంది. దీనికి బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పాయ్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. వాస్తవికతకు దగ్గరగా ఉండే కథలే ఎన్ కౌంటర్ కార్యక్రమంలో కనిపిస్తాయని మనోజ్ తెలిపారు.
ముంబై నగరంలో పోలీసులకు, గ్యాంగ్ స్టర్లకు మధ్య జరిగిన పోరాట సన్నివేశాలను ఈ కార్యక్రమంలో ప్రసారం చేయనున్నట్లు మనోజ్ చెప్పారు. దీనిలో భాగంగా ప్రతీ వారం ఒక గ్యాంగ్ స్టర్ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామన్నారు. ఇక్కడ ఫలానా వారే చూడాలనే నియమాలు ఏమీ లేవని, ఏ వయసులో వారైనా ఎన్ కౌంటర్ కార్యక్రమాన్ని చూడవచ్చన్నారు.