: ప్రజా సేవలో తరిస్తామంటున్న టాప్ టెన్ ధనవంతులు వీరే
'రాజకీయాలు ప్రజలకు సేవ చేసేందుకు' అన్న భావనతో ఒకప్పటి నేతలంతా, ఉన్నవి కూడా త్యాగం చేసి ప్రజాసేవలో తరించిపోయేవారు. ఇప్పడు రాజకీయాలు స్టేటస్ సింబల్ గా మారిపోయాయి. ప్రజలకు సేవ చేస్తున్నామని చెప్పే నేతలంతా అందుకే ఎన్నికవుతున్నారా? అనే సందేహం రాకమానదు. వేల కోట్లు సంపాదించి వాటిని ప్రజలకు పంచకుండా ఎలా సేవచేస్తారో ఓ పట్టాన సాధారణ పౌరుడికి అర్ధం కావడం లేదు. ఆ సంగతి అలా ఉంచితే, 16వ లోక్ సభకు పోటీ పడుతున్న అభ్యర్థుల్లో అత్యంత ధనవంతుల జాబితా ఇదే. వీరి ఆస్తి వివరాలు వింటే సాధారణ పౌరుడు గుండె దిటవు చేసుకోవాల్సిందే.
*ప్రధమస్థానం నందన్ నిలేకనిదే. ఆయన వయసు 58 ఏళ్లు కాగా, కర్ణాటక రాష్ట్రం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ పడుతున్న నిలేకనీ ఆస్తి 7,700 కోట్ల రూపాయలు.
*ద్వితీయ స్థానం అనిల్ కుమార్ శర్మది. ఈయన బీహార్ రాష్ట్రానికి చెందిన నేత, జనతాదళ్ (యూ) నుంచి పోటీ చేస్తున్న శర్మ ఆస్తి 850 కోట్ల రూపాయలు.
*తృతీయ స్థానం ప్రముఖ వ్యాపారవేత్త నవీన్ జిందాల్ ది. హర్యానా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జిందాల్ ఆస్తి 300 కోట్ల రూపాయలు.
*నాలుగవ స్థానం మణికుమార్ సుబ్బాది. అసోం రాష్ట్రానికి చెందిన మణికుమార్ సుబ్బా కాంగ్రెస్ నేత. మూడు సార్లు కాంగ్రెస్ నేతగా గెలిచిన సుబ్బాకు ఆ పార్టీ టికెట్ నిరాకరించింది. దీంతో ఆయన రెంబల్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈయన ఆస్తి 205 కోట్ల రూపాయలు.
*ఐదవ స్థానం కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ కుమార స్వామిది. జనతాదళ్ (సెక్యులర్) పార్టీ నుంచి పోటీ చేస్తున్న కుమారస్వామి ఆస్తి 190 కోట్ల రూపాయలు.
కుమార స్వామితో సమానంగా నాలుగో స్థానాన్ని పంచుకుంటున్న వ్యక్తి ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ వి బాలకృష్ణన్. ఆమ్ ఆద్మీ పార్టీ నేతగా కర్ణాటక నుంచి పోటీ చేస్తున్న ఈయన ఆస్తి కూడా 190 కోట్ల రూపాయలు కావడం విశేషం.
*ఆరవ స్థానం పినాకి మిశ్రాది. ఒడిశాలో బిజూ జనతాదళ్ తరపున పోటీ చేస్తున్న ఈయన ఆస్తి 137 కోట్ల రూపాయలు.
*ఏడవ స్థానం డీకే సురేష్ ది. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సురేష్ ఆస్తి 85 కోట్ల రూపాయలు.
*ఎనిమిదవ స్థానం కుల్ దీప్ బిష్ణోయ్ ది. హర్యానాలోని జన్ హత కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న బిష్ణోయ్ ఆస్తి 70 కోట్ల రూపాయలు.
*ఎ కృష్ణప్పది కూడా ఎనిమిదవ స్థానమే. జనతాదళ్ (సెక్యులర్) పార్టీ నుంచి కర్ణాటక ఎన్నికల బరిలో దిగుతున్న ఎ కృష్ణప్ప ఆస్తి 70 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.