: చారిత్రక యుద్ధ నౌకను ప్రభుత్వం తుక్కుగా అమ్మేస్తోంది!
ఒకప్పుడు భారతీయ నౌకాదళానికి తలమానికంగా ఉన్న తొలి విమాన వాహన యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ను భారత ప్రభుత్వం ఇప్పుడు తుక్కు కింద అమ్మేస్తోంది. 1971 నాటి యుద్ధంలో అత్యంత కీలక పాత్ర పోషించి, తూర్పు పాకిస్థాన్ ను దిగ్బంధనం చేసి, భారత్ విజయానికి బాటలు వేసిన ఐఎన్ఎస్ విక్రాంత్ ఘన చరిత్ర దృష్ట్యా దాన్ని కనీసం ఒక మ్యూజియంలా మార్చాలని కొందరు చేసిన ప్రయత్నాలను కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. విక్రాంత్ ను అరవై కోట్లకు తుక్కుగా అమ్మేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
15 వేల టన్నుల బరువున్న ఐఎన్ఎస్ విక్రాంత్ ను 1957లో ఇంగ్లండ్ నుంచి భారత నౌకాదళం కొనుగోలు చేసింది. ఇది చాలా కాలం భారత నౌకాదళానికి ఎనలేని సేవలందించింది. దీని నుంచి విమానాలు టేకాఫ్ చేయవచ్చు. శత్రువులపై దాడి చేసి మళ్లీ తిరిగి లాండ్ కావచ్చు. అంత విశాలమైన యుద్ధ నౌక ఇది. అయితే 1997లో ఈ చారిత్రాత్మక యుద్ధనౌకకు కాలం చెల్లిందని భారత నౌకాదళం ప్రకటించింది. ఆ తరువాత నుంచి దీన్ని తుక్కుగా అమ్మేయాలని సర్కారు భావించింది. గత వారం ఒక షిప్ బ్రేకింగ్ కంపెనీతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది.
అయితే సామాజిక కార్యకర్త పైన్ గావ్ కర్ విక్రాంత్ ను మ్యూజియంగా మార్చాలని, భావి తరాలకు దీని ఘనచరిత్రను, పోరాట వారసత్వాన్ని తెలియజేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. అయితే, దీని నిర్వహణ భారాన్ని తాము మోయలేమని మహారాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. దీంతో శత్రువును తుక్కుతుక్కు చేసిన ఈ చారిత్రక యుద్ధ నౌక ఇప్పుడు తుక్కుగా మారిపోనుంది.