: భారత్ తో చర్చల కోసం పాక్ ఎదురు చూస్తోందట!
సరిహద్దు వివాదాలు, కాల్పులు తదితర అంశాల కారణంగా భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. గతంలో పలుసార్లు ఇరు దేశాల అధికారులు చర్చలు జరిపినప్పటికీ పాక్ దుందుడుకు ప్రవర్తనే చూపింది. ఈ క్రమంలో భారత్ లో త్వరలో ఏర్పాటు కానున్న కొత్త ప్రభుత్వం, ప్రధానితో చర్చలు జరిపేందుకు పాక్ సిద్ధంగా ఉన్నట్లు న్యూఢిల్లీలో ఇస్లామాబాద్ తాజా దౌత్యాధికారి అబ్దుల్ బాసిత్ తెలిపారు.
ఈ విషయంలో ఇంకా ఎక్కువ సమయం వేచి చూడాల్సిన అవసరం లేదన్నారు. ఈ మేరకు ఓ ఆంగ్ల ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఒకవేళ బీజేపీ అభ్యర్థి నరేంద్ర మోడీయే ప్రధాని అయితే పాక్ వీసా ఇస్తుందా? అని అడగ్గా.. పాక్ ఇంతవరకు ఎవరికీ వీసాను తిరస్కరించలేదని, ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా చర్చలకు తాము సిద్ధమేనని వెల్లడించారు. కాబట్టి, ఇరు దేశాల చర్చలు త్వరగా ప్రారంభమవుతాయని ఆశిస్తున్నట్లు బాసిత్ పేర్కొన్నారు.