: మా ఊరికి రైలొచ్చిందోచ్...!


సంప్రదాయ దుస్తులు ధరించి, తండోపతండాలుగా ప్రజలు రైలు పట్టాలకు ఇరువైపులా నిల్చుని, హారతులు పట్టి, జెండాలు ఊపి, నృత్యాలు చేసి రైలు డ్రైవర్లను పూలదండలతో ముంచెత్తి మరీ ఆ రైలుకు స్వాగతం పలికారు. ఆ రైలు ఉదయం ఏడు గంటలకు బయల్దేరి, మధ్యాహ్నం 12.30కి గమ్యస్థానం చేరుకొంది. దారి పొడవునా పండుగ వాతావరణం నెలకొంది.

అసోంలోని డెకార్ గావ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటా నగర్ కి తొలిసారిగా రైలు వచ్చిన దృశ్యం అది. దీంతో ఈశాన్య భారతదేశంలో రైలు కనెక్టివిటీ ఉన్న రెండో రాజధానిగా ఈటానగర్ చరిత్రకెక్కింది. ఇలా అరుణాచల్ ప్రదేశ్ రైలు కల నెరవేరింది. ఈటానగర్ కి రైలు కళ వచ్చేసింది.

ఈ రైలును ఏర్పాటు చేస్తామని 1997లో అప్పటి రైల్వే మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ప్రకటించారు. దీన్ని పూర్తి చేస్తామని 2008లో ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారు. ఇవాళ్టికి అరుణాచల్ ప్రదేశ్ రైలు పట్టాల పైకి ఎక్కింది.

పది మంది ప్రయాణికులు, రెండు గూడ్సు కంపార్ట్ మెంట్లతో కూడిన ఆ రైలు రావడంతో ‘జై విశ్వకర్మ’ అన్న నినాదంతో ఈటానగర్ రైల్వేస్టేషన్ మార్మోగింది. ఈశాన్య భారతదేశం, బెంగాల్, ఒడిశాలలో మెకానికల్ వస్తువులు, యంత్రాలకు విశ్వకర్మ ఆదిదేవుడిగా భావిస్తారు. ఈ రైలు ప్రారంభం కావడంతో బుధవారం యాత్రీకులందరికీ ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించారు. ఎవరైనా ఎక్కడైనా రైలు ఎక్కొచ్చు... ఎక్కడైనా దిగొచ్చు. మొత్తానికి ఈ రైలు రాకతో ఈటానగర్ వాసులు పండుగ చేసుకున్నారు.

  • Loading...

More Telugu News