: ఉపాధి హామీలో ఆంధ్రప్రదేశ్ కు మొదటి స్థానం
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్.ఆర్.ఇ.జి.ఎ.) అమలు చేయటంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని కేంద్ర మంత్రి జైరాం రమేష్ తెలిపారు. మిగతా రాష్ట్రాలు దీన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు. దేశం అంతటా 8 శాతం కుటుంబాలు వంద రోజుల పనిదినాలను పూర్తి చేస్తే, ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే 15 శాతం కుటుంబాలు వందరోజుల పనిదినాలను పూర్తి చేశాయని మంత్రి ప్రశంసించారు.
రాష్ట్రంలో ఈ పథకం విజయవంతం కావడంలో అధికారులతో బాటు, క్షేత్రస్థాయిలో కృషి చేసిన వారి సహకారం కూడా ఉందన్నారు. ముఖ్యంగా ఈ పథకాన్ని ఎస్సీ, ఎస్టీలు బాగా ఉపయోగించుకుంటున్నాయని జైరాం తెలిపారు. కాగా, ఉపాధి పనులు మరింత ఉపయోగకరంగా, నాణ్యతగా ఉండాలంటే ఇందులో పంచాయతీలను భాగస్వాములుగా చేయాల్సిన అవసరం ఎంతైనా వుందని మంత్రి చెప్పారు.