: చెక్కేసిన ‘చిట్టీల’ రాణి పోలీసులకు దొరికేనా?
టీవీ, సినీ ఆర్టిస్టుల నుంచి రూ.10 కోట్లు దండుకున్న టీవీ ఆర్టిస్టు బత్తుల విజయరాణి పారిపోయి నెల కావొస్తున్నా ఇంతవరకు ఆచూకీ దొరకలేదు. బాధితుల ఫిర్యాదు మేరకు ఆమెతోపాటు చెల్లెలు సుధారాణి, నాని, శరణ్, శ్రీనివాసరావు, రమేష్, హరిబాబు, దుర్గలపై సీసీఎస్ డీసీపీ పాలరాజు చీటింగ్, కుట్ర కేసు నమోదు చేశారు. విజయరాణిని అరెస్ట్ చేయాలని బాధితులు ఆందోళనలు చేయడంతో నిందితురాలికి చెందిన రెండు ఇళ్లతో పాటు కారును కూడా పోలీసులు సీజ్ చేశారు.
అయితే ఇవాళ్టి వరకు విజయరాణి ఆచూకీ తెలియరాలేదు. ఇంటి సామానులు సహా ఆమె బెంగళూరుకు పారిపోయి ఉంటుందని కూకట్ పల్లిలోని ఓ లారీ ట్రాన్స్ పోర్ట్ కార్యాలయ సిబ్బంది ఇచ్చిన క్లూ ఆధారంగా స్పెషల్ టీమ్ బెంగళూరు వెళ్లి వెతికినా ఆచూకీ దొరకలేదు.
రెండేళ్ల నుంచే పక్కా పథకం వేసుకున్న విజయరాణి చిట్టీల పేరుతోనే కాకుండా తెలిసిన వారిందరి నుంచి అధిక వడ్డీ పేరుతో కోట్లాది రూపాయలు అప్పు చేసింది. అంతే కాకుండా తన కొడుకు హీరో అవుతున్నాడని నమ్మించి బంధువుల వద్ద నుంచి బంగారు ఆభరణాలను తీసుకొందని పోలీసుల విచారణలో తేలింది. ఆ తరువాత తన పేరుపై ఉన్న ఆస్తులన్నింటినీ అమ్మేసి ఉడాయించింది. ఇంతవరకు ఆమె, మిగిలిన నిందితుల జాడ లభించకపోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. అయితే, నిందితుల కోసం గాలిస్తున్నామని, ఇతర రాష్ట్రాలకు కూడా ప్రత్యేక బృందాలను పంపినా ఇంతవరకు ఆచూకీ దొరకలేదని సీసీఎస్ అధికారులు చెప్పారు. త్వరలోనే విజయరాణిని పట్టుకుంటామని సీసీఎస్ అధికారులు చెబుతున్నారు.