: శ్రీకాకుళంలోని శ్రీచక్రపురంలో ఘనంగా సీతారామ కల్యాణోత్సవం
శ్రీకాకుళంలోని నవభారత్ జంక్షన్, శ్రీచక్రపురంలో వెలసిన శ్రీరాజరాజేశ్వరి ఆలయంలో చైత్రమాస నవమి సందర్భంగా ఈరోజు వైభవోపేతంగా సీతారామ కల్యాణం జరిగింది. అరసవిల్లికి చెందిన వేద పండితులచే, శ్రీవిద్యోపాసకులు తేజోమూర్తుల బాలభాస్కర శర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున మూలవిరాట్టుకు విశేష పూజలు, శ్రీచక్రార్చన చేసిన తర్వాత ఆలయంలో జరిగిన సీతారాముల కల్యాణోత్సవంలో చదివించిన కట్న కానుకలను ప్రతీ యేటా ఒక పేద అమ్మాయి వివాహానికి వినియోగించనున్నట్లు బాలభాస్కరశర్మ తెలిపారు. ఈ కల్యాణోత్సవంలోని అక్షింతలను తలపై వేసుకుంటే అవివాహితులకు త్వరగా వివాహం జరుగుతుందన్నారు.
సాయంత్రం 1001 శ్రీ చక్రాలకు దీపారాధన కార్యక్రమం నిర్వహించి మహామేరువుకు ప్రత్యేక హారతిని ఇచ్చారు. కల్యాణోత్సవం సందర్భంగా ఇవాళ అన్నసమారాధన కార్యక్రమం జరిగింది. రాములోరి కల్యాణోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.