: అవినీతిపై పోరాడడమే నా తప్పా?: శంకర్రావు
అవినీతిపై పోరాడడమే నేను చేసిన తప్పా? అంటూ మాజీ మంత్రి శంకర్రావు కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తనకు కాంగ్రెస్ పార్టీ పైనా, సోనియా గాంధీపైనా విశ్వాసం ఉందని, టికెట్ కేటాయింపుపై పునరాలోచించాలని డిమాండ్ చేశారు. రాజ్యసభ సభ్యుడు కేవీపీ, టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ తనపై కుట్ర పూరితంగా వ్యవహరించారని ఆయన మండిపడ్డారు.
టీపీసీసీ చీఫ్ పొన్నాల పార్టీ టికెట్ అమ్ముకున్నారని శంకర్రావు ఆరోపించారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో ముఖ్యమంత్రిగా దళితుడ్ని చేస్తారని కేంద్ర మంత్రి జైరాం రమేష్ ప్రకటించడంతో... తన అడ్డు తొలగించుకునేందుకు, కావాలనే వారు తనకు టికెట్ రాకుండా చేశారని ఆయన ఆరోపించారు. తన కుమార్తెకైనా టికెట్ ఇస్తారని ఆశించానని ఆయన వాపోయారు.