: 'డామిట్ కథ అడ్డం తిరిగింది'...శంకరన్నకు పార్టీ చెయ్యిచ్చింది
'డామిట్ కథ అడ్డం తిరిగింది'... కాంగ్రెస్ అధిష్ఠానానికి వీరవిధేయుడిగా పేరుగాంచిన శంకరన్నకు పార్టీ చెయ్యిచ్చింది. 'అతి వినయం ధూర్త లక్షణం' అనుకుందో లేక అందర్నీ విమర్శించిన శంకర్రావు రేపు తమను మాత్రం వదిలిపెడతాడా? అనుకుందో కానీ కాంగ్రెస్ పార్టీ శంకర్రావుకు ఝలకిచ్చింది. పార్టీని వీడి...నానా దుర్భాషలాడి, టీఆర్ఎస్ లోకి వెళ్లి అక్కడ ఆదరణ దొరక్క తిరిగి వచ్చిన వినోద్, వివేక్ లకు టికెట్టిచ్చిన కాంగ్రెస్ ఆధిష్ఠానం... ఆది నుంచి పార్టీని అంటి పెట్టుకుని, పార్టీకి నచ్చని వారిని ఇబ్బంది పెట్టేందుకు సదా సిద్ధంగా ఉండే శంకర్రావును 'ఆటలో అరటిపండు'లా ఉపయోగించుకుని 'కూరలో కరివేపాకులా' తీసి పడేసింది.
నోటికి వచ్చింది మాట్లాడే శంకర్రావుగా పేరు తెచ్చుకున్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావు... మంత్రి పీఠం దిగిన దగ్గర్నుంచి సోనియా నామస్మరణలో తపించిపోయాడు. అవకాశమున్న ప్రతిసారీ తన విధేయతను చాటుకునేవాడు. తెలంగాణ ప్రకటించగానే దేవుడే సాక్షాత్తూ సాక్షాత్కరించిన భక్తుడిలా... సోనియా గాంధీని తెలంగాణ తల్లిగా ప్రకటించేశాడు. అంతటితో ఆగకుండా తెలంగాణకు సోనియా పేరు పెట్టాలని ప్రతిపాదించాడు. సోనియాకు ఏకంగా గుడి కూడా కట్టించేశాడు.
సీటు కోసం తీవ్ర ప్రయత్నాలు చేసిన శంకర్రావు తనను తిరస్కరించినా తన కుమార్తెకయినా సీటు కేటాయించాలని కోరాడు. దాన్ని కూడా అధిష్ఠానం పట్టించుకోకపోవడంతో, 'డామిట్ కథ అడ్డం తిరిగింది' అనుకున్న శంకర్రావు భవిష్యత్ ప్రణాళిక రచించుకోవడంలో నిమగ్నమైపోయాడు.